: భారత సైన్యంతో పెట్టుకోవద్దు.. జాగ్రత్త: రెజ్లర్ సుశీల్ కుమార్, బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దర్జాగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్న ఉగ్రవాదులపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన నేపథ్యంలో సైన్యం తీసుకున్న చర్యలపై దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. చిన్నారుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ భారత జవాన్లకు జై కొడుతున్నారు. తాజాగా ఇండియన్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త అని పేర్కొన్నాడు. ‘భారతీయ్ సేనా సే పంగా మత్ లేనా.. జైహింద్’ అని హిందీలో ఆయన ట్వీట్ చేశాడు. మరోవైపు వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ దత్, విజేందర్ సింగ్ లు కూడా భారత సైన్యం తీసుకున్న చర్యపై హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా భారత సైన్యం చేసిన సాహసంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ప్రతి ఒక్క ఇండియన్ ప్రాణం ఎంతో విలువైందని నిరూపించిన జవాన్లకు హ్యాట్సాఫ్ అని అన్నాడు. అజయ్ దేవ్‌గణ్ పలు సినిమాల్లో పోలీసు, సైనిక పాత్రల్లో కనిపించి దేశ భక్తిని పెంపొందిచేలా డైలాగులు చెప్పిన విషయం తెలిసిందే.