: పాకిస్థాన్ కేవలం కాశ్మీర్ పైనే దాడికి దిగుతుందనుకుంటున్నారా?.. కాదంటున్న మాజీ ఆర్మీ అధికారులు
ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన దాడుల తరువాత పాకిస్థాన్ ప్రతీకారం ఎలా తీర్చుకోనుందన్న ఆసక్తి సర్వత్ర వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ రీజనల్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణారావు మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రతీకార దాడులకు దిగడం ఖాయమని అన్నారు. అయితే సాధారణ ప్రజానీకం భావిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రతీకార దాడులు కేవలం జమ్మూకాశ్మీర్ లోనే ఉండవని అన్నారు. భారత్ లోని సుదీర్ఘ సరిహద్దుల వెంబడి ఎక్కడి నుంచైనా పాకిస్థాన్ దాడులకు తెగబడే అవకాశం ఉందని వారు తెలిపారు. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీ ఎవరికీ దొరకకుండా భారత నావికా దళానికి ఆయువుపట్టైన విశాఖపట్టణం వచ్చి పోర్టును కకావికలం చేసేసి, వెనుదిరగాలని ప్లాన్ చేసుకుంది. అయితే భారత ప్రభుత్వం నీటిలో అమర్చిన వాటర్ ల్యాండ్ మైన్ పైకి అది రావడంతో ముక్కలైపోయింది. లేని పక్షంలో భారత్ ఊహించని నష్టాన్ని జరిపి వెళ్లిఉండేదని వారు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే దాడికి దిగే అవకాశం ఉందని అన్నారు. భారత్ కు 900 కిలోమీటర్ల సరిహద్దు పాకిస్థాన్ తో మాత్రమే ఉందని, 4,000 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్ తో ఉందని వారు తెలిపారు. అంతేకాదు, సుదీర్ఘమైన తీర రేఖ కూడా భారత్ కు సరిహద్దుగా ఉందని వారు గుర్తు చేశారు. ఇలా ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ప్రతీకారదాడికి దిగే అవకాశం ఉందని వారు తెలిపారు.