: ‘ఉగ్రవాదంపై జీరో టోలెరన్స్’.. యుద్ధ పరిస్థితులపై అఖిలపక్ష భేటీ ముగిసిన తరువాత ప్రముఖ పార్టీ నేతల స్పందన
పాక్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ముగిసిన విషయం తెలిసిందే. పాక్ వైఖరి, ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులు, భద్రతపై రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) చీఫ్ రణ్‌బీర్ సింగ్ పార్టీల నేతలకు సుమారు 50 నిమిషాల పాటు వివరించి చెప్పారు. అనంతరం పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ సైనికులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. భారత సైన్యం మంచి నిర్ణయాన్ని తీసుకుందని అన్నారు. సైన్యం జరిపిన దాడిపై, పాక్ చొరబాటుపై డీజీఎంవో చీఫ్ రణ్‌బీర్ సింగ్ తమకు వివరించినట్లు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ... ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సైనికులకు తాను మరోసారి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదంపై జీరో టోలెరన్స్ చూపిస్తామని అన్నారు. అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని రక్షణ శాఖ అధికారులు అఖిల పక్ష సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.