: దాడులను భారత్ సహించబోదు.. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి!: అఖిలపక్ష భేటీ వివరాలు తెలిపిన వెంకయ్య నాయుడు
నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాదులపై భారత సైన్యం చేసిన దాడిపైన, తాజా పరిణామాలపైన ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. తాము సైన్యానికి అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. నార్త్ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ అన్ని పార్టీల నేతలకు అన్ని అంశాలు సవివరంగా చెప్పారని ఆయన అన్నారు. పాక్ జరిపిన దారుణాలకు జవాబే ఈ మెరుపుదాడని ఆయన అన్నారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబాటుకి ప్రయత్నించారని, అందుకే మన సైన్యం దాడి చేసిందని ఆయన వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని వెంకయ్యనాయుడు చెప్పారు. దాడులను భారత్ సహించబోదని అన్నారు. పాక్ కుట్రలను తిప్పికొడుతున్నట్లు తెలిపారు. సమావేశానికి కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, టీడీపీ, ఎల్‌జేపీ నేతలు హాజరయ్యారని చెప్పారు. దాడులను సహించబోమని పాక్ గుర్తించాలని ఆయన అన్నారు. సైన్యం చేసిన లక్షిత దాడులను అందరూ ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు.