: దెబ్బకు దెబ్బ తీయడంపై యూరీ అమర సైనికుల కుటుంబాల స్పందన.. హఫీజ్ సయీద్‌ను టార్గెట్ చేయాలని డిమాండ్
నియంత్రణ రేఖను దాటి మరీ పాక్ భూభాగంలో తలదాచుకుంటున్న పలువురు ఉగ్రవాదులను భారత్ సైన్యం హతమార్చిన ఘటనపై భారత ప్రతిపక్ష పార్టీలు సహా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశం జరిపిన యూరీ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌కు హాని తలపెట్టేందుకు ప్లాన్ వేస్తోన్న లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాద సూత్రధారుల్ని కూడా ఇండియన్ ఆర్మీ హతమార్చాలని కోరుకుంటున్నారు. యూరీ ఘటనలో మృతిచెందిన జవాను హవల్దార్ అశోక్‌కుమార్ సింగ్ భార్య సంగీతా దేవీ మీడియాతో మాట్లాడుతూ... భారత సైన్యం తీసుకున్న చర్యపై తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. హఫీజ్ సయీద్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. మన దేశంలో జరిగిన అనేక దాడులకు ఆయనే కారణమని ఆమె అన్నారు. అతడిని భారత సైన్యం లక్ష్యంగా పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరో అమర జవాను ఎస్‌కే విద్యార్థి భార్య మాట్లాడుతూ యూరీ దాడులకు ముందే భారత్ పాక్ లోని స్థావరాలపై దాడికి దిగి వుంటే కనుక 18 మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు.