: బయ్యారం స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి చౌదరి బీరేందర్ సింగ్ హామీ ఇచ్చారు: ఢిల్లీలో కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేస్తూ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి చౌదరి బీరేందర్ సింగ్‌ను కోరినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ అంశంపై ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన చౌదరి బీరేందర్ సింగ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ అంశం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి అందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో పర్యటించాలని కూడా కేంద్రమంత్రిని కోరినట్లు కేటీఆర్ తెలిపారు.