: తుపాకీతో తండ్రిని కాల్చి చంపిన బాలుడు.. తరువాత స్కూల్లో కాల్పులు జరిపిన వైనం!
అమెరికాను గన్ కల్చర్ కలవరపెడుతూనే ఉంది. దక్షిణ కరోలినాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు తుపాకీని చేతపట్టుకొని రెచ్చిపోయాడు. కన్న తండ్రినే కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా తన ఇంటి సమీపంలో ఉన్న ఓ స్కూల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. స్కూల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు మీడియాకు వివరిస్తూ... ఆ బాలుడు తన తండ్రి జెఫ్రీ డెవిట్ ఓస్‌బోర్న్‌ను కాల్చి చంపిన అనంతరం అక్కడి టౌన్‌విల్లె ఎలిమెంటరీ స్కూల్ మైదానంలోకి వెళ్లి కాల్పులు జరిపాడని చెప్పారు. భయానికి గురయిన ఆ పాఠశాల టీచర్లు స్కూల్లోని విద్యార్థులను తీసుకుని స్కూలు భవనంలోకి వెళ్లినట్టు చెప్పారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. అక్కడికి చేరుకున్న ఓ అగ్నిమాపక వాలంటీర్ బాలుడిని పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. బాలుడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడో తెలియరాలేదు. ఆ బాలుడు స్కూలుకి వెళ్లకుండా ఇంటి దగ్గరే తన చదువును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.