: భారత క్రికెట్ బోర్డుపై పొంచి ఉన్న ఐసీసీ సస్పెన్షన్ వేటు
ఆర్ఎం లోథా కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు గనుక ఆమోదిస్తే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చేస్తే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన అధికారాలను వినియోగించుకుని బీసీసీఐపై నిషేధం కూడా విధించవచ్చు. బీసీసీఐ ఆఫీసు బేరర్లను తొలగించి వారి స్థానంలో నిర్వహణ అధికారులతో కూడిన ప్యానల్ ఏర్పాటుకు అనుమతించాలన్నది లోథా కమిటీ కోర్టు ముందుంచిన అభ్యర్థన. కానీ ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.9 లో సభ్యుల స్వేచ్చా, స్వాంతంత్ర్యం గురించి వివరించారు. దీని ప్రకారం వెలుపలి జోక్యానికి తావు లేదు. ముఖ్యంగా ఐసీసీలో సభ్యులుగా ఉన్న ఏదేనీ క్రికెట్ బోర్డు విషయంలో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఐసీసీ చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది. స్వేచ్చగా ఎన్నికయ్యేలా బోర్డులకు అవకాశం కల్పించాలి. లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ నియామకాలకు అవకాశం కల్పించాలి. ఏదేనీ సందర్భంలో బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆ బోర్డును సస్పెండ్ చేయడానికి, గుర్తింపు నిరాకరించడానికి ఐసీసీకి అధికారాలను ఆర్టికల్ 2.7 కల్పిస్తోంది. కాగా, బీసీసీఐపై తదుపరి సుప్రీంకోర్టు విచారణ అయిన అక్టోబర్ 6 తర్వాత ఈ అస్పష్టత తేలిపోనుంది.