: పీవోకేలో ఉగ్ర‌వాద శిబిరాల‌పై దాడులు నిర్వ‌హించాం: డీజీఎంవో చీఫ్ ర‌ణ్‌బీర్ సింగ్


పాకిస్థాన్ నుంచి, ఉగ్రవాదుల నుంచి తలెత్తే ఎటువంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కునేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని విదేశాంగ ర‌క్ష‌ణ శాఖ, భారత ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆపరేష‌న్స్ (డీజీఎంవో) చీఫ్ ర‌ణ్‌బీర్ సింగ్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. పాక్ మ‌రోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. పాక్ నుంచి చోటుచేసుకున్న చొర‌బాట్ల‌ను ఇప్పటివరకు 20 ప్ర‌దేశాల్లో అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రికూడా ఉగ్ర‌వాదుల చొర‌బాటును తిప్పికొట్టినట్లు ర‌ణ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు. పాక్ క‌వ్వింపు చ‌ర్య‌లను తాము ఉపేక్షించడం లేదని చెప్పారు. పాక్ ఆర్మీకి చొరబాట్ల అంశాలపై సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ దేశం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో స‌మాచారం ఇవ్వ‌లేదని పేర్కొన్నారు. కాల్పుల వెనుక ప్ర‌మేయం ఉన్నవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వని అన్నారు. స‌రిహ‌ద్దుల్లో పాక్ ప‌దే ప‌దే ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోందని చెప్పారు. ఆ దేశ ఆగడాలను అడ్డుకుని, తిప్పికొట్టేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు తెలిపారు. పీవోకే లో ఉగ్ర‌వాద శిబిరాల‌పై దాడులు నిర్వ‌హించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పాక్ ఆర్మీ తమతో స‌హ‌క‌రిస్తుంద‌ని ఆశించినట్లు తెలిపారు. కానీ అటువైపు నుంచి స్పందన లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News