: పాక్ విషయంలో కేంద్రం విధానాన్ని మెచ్చుకున్న రతన్ టాటా
ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా కేంద్రం విధానాన్ని భేష్ అంటూ మెచ్చుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, పాకిస్తాన్ లో నవంబర్ లో జరిగే సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరు కారాదని కేంద్ర సర్కారు నిర్ణయించింది. ఇటీవలి ఉరీ ఉగ్రవాద దుశ్చర్య నేపథ్యంలో పాక్ తీరును ఎండగట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నిర్ణయం నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా పాక్ లో జరిగే సార్క్ సదస్సులో తాము కూడా పాల్గొనడం లేదని బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్తాన్ ప్రకటించాయి. ఈ విషయమై రతన్ టాటా స్పందించారు. ఉరీ దాడి నేపథ్యంలో సార్క్ సదస్సును బాయ్ కాట్ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసించారు. ‘సార్క్ సదస్సు సమావేశాన్ని బాయ్ కాట్ చేయాలన్న భారత ప్రభుత్వం దృఢమైన విధానం చాలా గర్వకారణం. దీనిపై సభ్య దేశాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది’ అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను 8వేల మంది లైక్ చేయగా... మరో 5వేల మంది తిరిగి ట్వీట్ల రూపంలో స్పందించారు.