: విశాఖపట్నం చేరుకున్న అండమాన్ నౌక.. 36 గంటలపాటు నరకం చూసిన ప్రయాణికులు
అండమాన్ వెళ్తూ సాంకేతిక కారణాలతో సముద్రం మధ్యలో నిలిచిపోయిన హర్షవర్ధన్ నౌక అండమాన్ వెళ్లకుండా తిరిగి విశాఖకు చేరుకుంది. ఏం జరుగుతోందో తెలియక అల్లాడిపోయిన ప్రయాణికులు 36 గంటలపాటు నరకం అనుభవించారు. చివరికి గమ్యం చేరకుండానే క్షేమంగా తిరిగొచ్చారు. నౌకలో చిక్కుకుపోయిన తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపించారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం గంటలు 1:30కి 600 మంది ప్రయాణికులతో అండమాన్ బయలుదేరిన ‘హర్షవర్ధన్’లో ఆరు గంటల ప్రయాణం తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మరోమార్గం లేక నౌకను సముద్రంలోనే నిలిపివేశారు. ఒకదశలో నౌక క్షేమంగా తిరిగి తీరం చేరుకుంటుందో లేదోనని భయపడిన ప్రయాణికులు బుధవారం రాత్రి విశాఖ తీరానికి చేరుకోవడంతో ఊపరి పీల్చుకున్నారు.