: త్వరలో పట్టాలెక్కనున్న ‘బడ్జెట్’ రైళ్లు.. ఏపీకి ‘హమ్‌సఫర్’, ‘ఉదయ్’
రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కనున్నట్టు సమాచారం. రైల్వే మంత్రి ప్రకటించిన వాటిలో ‘హమ్‌సఫర్’, ‘ఉదయ్’ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లో కూతపెట్టనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త టైంటేబుల్‌లో మొత్తం 20 కొత్త రకం రైళ్లను అధికారులు చేర్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఏపీకి తిరుపతి-జమ్ముతావి హమ్‌సఫర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-విజయవాడ మధ్య ఉదయ్ రైళ్లకు స్థానం కల్పించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇవి కాకుండా రాష్ట్రం మీదుగా ప్రయాణించే రైళ్లు మరో ఆరు వరకు ఉన్నట్టు తెలిసింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్‌లో పేర్కొన్న హమ్‌సఫర్, ఉదయ్, తేజస్, అంత్యోదయ రైళ్లను అక్టోబరు నుంచి దశల వారీగా పట్టాలెక్కించాలని రైల్వే నిర్ణయించింది. తిరుపతి-జమ్ముతావి మధ్య నడిచే ‘హమ్‌సఫర్’లో అన్ని కంపార్ట్‌మెంట్‌లు థర్డ్ క్లాస్ ఏసీతో ఉంటాయి. సాధారణ రైలు చార్జీలతో పోలిస్తే ఇందులో టికెట్ ధర 20 శాతం అధికంగా ఉంటుంది. రైలులో వైఫై కూడా ఉంటుంది. వారంలో ఓ రోజు తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు మార్గం మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఇక విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ ఏసీ రైలు. రద్దీ మార్గాల్లో రాత్రి వేళల్లో బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకోవడంమే ఈ రైలు లక్ష్యం. అయితే విజయవాడ-విశాఖపట్నం మధ్య ఏ వేళలో తిప్పాలన్న దానిపై ఇప్పటి వరకు అధికారుల్లో స్పష్టత లేదు. ఇక ఏపీ మీదుగా ప్రయాణించే కొత్త రైళ్లలో చెన్నై-అహ్మదాబాద్, హౌరా-యశ్వంత్‌పూర్, కామాఖ్య-బెంగళూరు, సంత్రగచ్చి-చెన్నై, హౌరా-ఎర్నాకుళం రైళ్లు ఉన్నాయి.