: వచ్చే దసరా నాటికి యాదాద్రి ఆలయాన్ని సిద్ధం చేయండి.. అధికారులకు కేసీఆర్ ఆదేశం
వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. దేవాలయ పనులపై బుధవారం సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ తుది నమూనాకు ఆమోదం తెలిసిన కేసీఆర్ త్రీడీ నమూనాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాజగోపురాలతోపాటు ప్రాకార మండలాలు పూర్తిగా శిలలతో నిర్మితమవుతున్న మొట్టమొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 500 మంది నిపుణులు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం వంటి ప్రముఖల కోసం నిర్మించే కాటేజీలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. ఆగమశాస్త్ర సూత్రాలకు అనుగుణంగానే దేవాలయానికి ప్రాణప్రతిష్ఠ జరగాలని పేర్కొన్నారు. 250 ఎకరాల్లో చేపట్టిన వసతి గృహ నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నట్టు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా 108 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న ఆంజనేయ స్వామి విగ్రహ నమూనాను పరిశీలించిన కేసీఆర్ దానికి ఆమోదం తెలిపారు.