: 13 ఏళ్లలో సంతోషాంధ్రప్రదేశ్.. ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029’లో పారిశ్రామిక రంగానికి పెద్దపీట


నవ్యాంధ్రను వచ్చే పదమూడేళ్లలో సంతోషాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్-2029’ లో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలతో కూడిన ‘విజన్-2029’ ముసాయిదాను బుధవారం కలెక్టర్ల సమావేశంలో విడుదల చేశారు. విజన్‌లోని ప్రధాన లక్ష్యాలను ఓసారి పరికించి చూస్తే.. * వచ్చే 13 ఏళ్లలో 25 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు * మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 15 లక్షల మందికి ఉపాధి * 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.97 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం * రాష్ట్ర తలసరి ఆదాయం రూ.9.61 లక్షలకు పెంచడం విజన్-2029లో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేసిన సర్కారు 15 ఏళ్లపాటు రెండంకెల వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014-15లో రూ.5.2 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని 2029-30కి రూ.28.45 లక్షల కోట్లకు తీసుకెళ్లాలనేది విజన్‌లో ప్రధాన లక్ష్యం. తలసరి ఉత్పత్తిని పెంచడంతో పాటు తలసరి ఆదాయాన్ని కూడా పెంచాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. సర్వీసుల రంగం, వ్యవసాయ రంగం, ఉపాధి, పరిశ్రమ రంగాల్లో వాటాను గణనీయంగా పెంచనున్నారు. పరిశ్రమల రంగంలో ఉపాధిని పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న 18 శాతాన్ని 30 శాతం వరకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అదే సమయంలో వ్యవసాయంపై ఆధారపడేవారిని 40 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని పైకి తీసుకురావడం, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పన, ప్రజలకు అందుతున్న అన్ని సేవల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేర్చడం, ప్రాథమిక అవసరాలు తీర్చి ఆరోగ్య, ఆనందదాయక సమాజాన్ని నిర్మించడమే విజన్-2029 లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

  • Loading...

More Telugu News