: చిందేసిన డిస్కోబాబా.. ఎంజాయ్ చేసిన పోలీసులు


మంత్రాలతో బంగారం, వజ్రాలను పుట్టిస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న బ్లాక్ మెజిషియన్లపై హైదరాబాద్ పోలీసులు దాడులు జరిపారు. మంత్ర, తంత్రాలతో వైద్యం చేస్తున్న మంత్రగాళ్లను నిన్న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గుప్తనిధులు వెలికి తీస్తామంటూ పలువురిని మోసం చేసిన డిస్కోబాబా అలియాస్ మహ్మద్ అన్వర్ ఖాన్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న డిస్కోబాబాపై పీడీ చట్టం ప్రయోగిస్తామని పోలీసులు చెప్పారు. డ్యాన్స్ చేసి అతీంద్రయ శక్తులను రప్పించుకుని రోగాలను నయం చేస్తుంటానని, లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటానని ఈ బురిడీ బాబా చెబుతుంటాడని పేర్కొన్నారు. ఈ విధంగా చార్మినార్ ప్రాంతంలో ఒక వ్యాపారిని తాజాగా మోసగించాడని చెప్పారు. అయితే, విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే పోలీసుల ముందే డిస్కోబాబా చిందేశాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఉన్న డిస్కోబాబా టక్ చేసి, వైట్ క్యాప్, వైట్ షూ ధరించి డ్యాన్స్ చేస్తుంటే, పోలీసులు నవ్వుతున్న దృశ్యం ‘గబ్బర్ సింగ్’ సినిమాలో సన్నివేశాన్ని తలపించింది.

  • Loading...

More Telugu News