: 'అవి జోకులా? హేళనా?' అంటూ టీవీ షో మధ్యలో వైదొలగిన బాలీవుడ్ నటి


జోకుల పేరిట హేళన చేస్తే మనసు గాయపడుతుంది. అలా గాయపడిన ఓ బాలీవుడ్ నటి గట్టి రిటార్ట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే, తాజాగా 'పర్చేద్' సినిమా హాలీవుడ్ లోని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం దర్శకురాలు లీనా యాదవ్ తో కలిసి రాధికా ఆప్టే, తనిష్ఠా ఛటర్జీ, సుర్వీన్ ఛావ్లాతో కలిసి కలర్స్ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే 'కామెడీ నైట్స్ బచావ్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో 'రోస్ట్' పేరిట ఎగతాళి చేస్తారు. దానికి అందులో పాల్గొన్న వారితో పాటు అతిధులుగా పాల్గొన్న వారు కూడా పడిపడి నవ్వుతారు. ఈ సందర్భంగా తనిష్ఠా ఛటర్జీపై ఓ కంటెస్టెంట్ 'మీరు నల్లరేగు పళ్లు ఎక్కువగా తింటారు కదా?' అని అన్నాడు. ఎందుకా ప్రశ్న అడిగారని అనుకునేంతలోనే దానికి సమాధానంగా, 'అందుకే మీరు నల్లగా ఉన్నారు' అని సదరు కంటెస్టెంట్ పేర్కొన్నాడు. దీంతో తనిష్ఠా ఛటర్జీకి కోపం ముంచుకొచ్చింది. రంగుమీద వ్యాఖ్యలు చేయడం వివక్ష కిందికి వస్తుందని చెప్పి, షో నుంచి వైదొలగింది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల రూపురేఖలని చులకన చేసే వ్యాఖ్యలతో పరిహాసమాడటం ఏమాత్రం నచ్చలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే ఓ కామెడీ షోలో ఇంత దారుణమైన జోకులేయడం తనను షాక్ కు గురి చేసిందని ఆమె తెలిపింది. ఒంటిరంగు కారణంగా మన దేశంలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదని, పెళ్లి ప్రకటనల్లోనూ శరీర ఛాయ ప్రధాన పాత్ర పోషించడానికి కారణం... దేశంలోని కులవ్యవస్థ మూలాల్లోనే ఈ వర్ణ వివక్ష ఉండడమని ఆమె అభిప్రాయపడింది. ఇది సరైన విధానం కాదని, ఇలాంటి విధానానికి తాను నవ్వుతూ అక్కడే ఉండి మద్దతు పలకలేక షో నుంచి నిష్క్రమించానని స్పష్టం చేసింది. దీంతో ఆమె నిర్ణయానికి పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

  • Loading...

More Telugu News