: 2004 నుంచి ఎమ్మెల్యేగా వున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మరి నయీంతో సంబంధాలు ఎవరికి వుంటాయి?: టీఆర్ఎస్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి
2004 నుంచి నల్గొండ ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తికి నయీంతో సంబంధాలు ఉంటాయా? టీఆర్ఎస్ నేతగా ఏ పదవీ లేకుండా వేధింపులకు గురైన తనకు సంబంధాలు ఉంటాయా? అని టీఆర్ఎస్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో నయీం ఆదేశాలతో కార్పొరేటర్లంతా ఓ ఫంక్షన్ హాల్ కు వెళ్లారని, అప్పుడు కారులో నయీం కూర్చుని ఉంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడని అన్నారు. 'ఇప్పుడు చెప్పండి.. నయీంతో సంబంధాలు ఎవరికి వున్నాయి' అని ఆయన నిలదీశారు. అధికారంలో లేని వ్యక్తికి గ్యాంగ్ స్టర్ తో సంబంధాలు ఉంటే అతనిని అధికార పక్షం వదిలేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. నయీంతో కలసి సెటిల్ మెంట్లు చేసిన కోమటిరెడ్డి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించే రాములు ఎదుగుదల చూడలేక, ముప్పుగా మారతాడని భావించి హత్య చేయించింది ఎవరని ఆయన నిలదీశారు.