: మళ్లీ ప్రారంభం కానున్న గాజు వంతెన సందర్శన...హైహీల్స్ కు నో పర్మిషన్
చైనాలోని బీజింగ్ సమీపంలో వేలాడే గాజువంతెన ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. మరమ్మతులు పూర్తి చేసిన సాంకేతిక నిపుణులు బ్రిడ్జ్ పైకి హైహీల్స్ వేసుకుని వెళ్లే వారిని అనుమతించమని తెలిపారు. హై హీల్స్ కారణంగా గాజు వంతెనపై ఒత్తిడి పడుతోందని, వీటి కారణంగా వంతెన దెబ్బతినే అవకాశముందని తెలిపారు. వంతెన సామర్థ్యాన్ని బట్టి రోజుకి 8,000 మందిని మాత్రమే అనుమతించాల్సి వుండగా, ఈ వంతెనను చూసేందుకు ప్రతి రోజూ 10,000 మంది వస్తున్నారు. దీంతో వంతెన సామర్థ్యానికి మించిన బరువు మోయాల్సి వస్తోంది. దీంతో వంతెనపై నడవాలంటే ముందుగా ఆన్ లైన్ ద్వారా సుమారు 1400 రూపాయల విలువైన టికెట్ ను బుక్ చేసుకోవాలి. అది ఖరారైన తరువాత మాత్రమే అక్కడ స్వైప్ చేస్తే బ్రిడ్జిపై నడిచేందుకు గేటు తెరుచుకుంటుంది. దీంతో వంతెనపై ఒత్తిడి, ట్రాఫిక్ కూడా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచే ఈ గాజు వంతెన ఎక్కేందుకు చైనీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తి చూపడం విశేషం.