: మోదీ సంస్కరణలకు గుర్తింపు... 'పోటీ' సూచికలో రివ్వున ఎగసిన ఇండియా!
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకటించిన ప్రపంచ పోటీతత్వ సూచికలో (గ్లోబల్ కాంపిటేటివ్ నెస్ ఇండెక్స్)లో భారత్ రివ్వున ఎగసింది. గత సంవత్సరం ఈ జాబితాలో 55వ స్థానంలో ఉన్న ఇండియా, ఈ సంవత్సరం ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంకుకు చేరింది. మొత్తం 138 దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను తయారు చేయగా, రెండేళ్ల క్రితం 67వ స్థానంలో ఉన్న ఇండియా ఏకంగా 32 స్థానాలు ఎగబాకడం గమనార్హం. ఇక బ్రిక్స్ దేశాల వరకూ చూస్తే, చైనా తరువాత రెండో స్థానంలో భారత్ నిలిచింది. ఈ కాంపిటేటివ్ నెస్ ఇండెక్స్ లో తొలి స్థానంలో స్విట్జర్లాండ్ నిలువగా, ఆపై సింగపూర్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ టాప్-5లో ఉన్నాయి. వీటి తరువాత స్వీడన్, యూకే, జపాన్, హాంకాంగ్, ఫిన్ లాండ్ లకు స్థానం లభించింది. భారత ప్రదాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కారు అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ఇండియా పలు దేశాలను దాటి జీసీఐ ఇండెక్స్ లో ముందుకు సాగిందని ఎకనామిక్ ఫోరమ్ తెలిపింది.