: సరికొత్త రైఫిల్స్ కోసం ప్రపంచాన్ని జల్లెడ పడుతున్న భారత సైన్యం


భారత సైనిక అవసరాలు తీర్చేలా సరికొత్త తుపాకుల కోసం భారత్ మరోసారి తన ప్రయత్నాలను ప్రారంభించింది. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా లభించే ఆధునిక రైఫిల్స్ కోసం దశాబ్దకాలంగా జల్లెడ పడుతూ విఫలమవుతున్న భారత సైన్యం, మరోసారి వేట ప్రారంభించింది. తొలి దశలో 65 వేల రైఫిల్స్ కొనుగోలు చేయాలని, ఆపై 1.20 లక్షల రైఫిళ్లను ఇండియాలో తయారు చేసి ఇచ్చే దిశగా డీల్ కు అంగీకరించే కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలన్నది సైన్యం ఉద్దేశం. దాదాపు 12 లక్షల మందికి పైగా సైన్యాన్ని కలిగున్న ఇండియా, వీరందరికీ సరిపడా ఆధునిక తుపాకులను అందించేందుకు సుమారు రూ. 6,700 కోట్లను వెచ్చించనుంది. కాగా, స.హ చట్టాన్ని వినియోగించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి పొందిన సమాచారం ప్రకారం, ఇప్పుడున్న 5.56 ఎంఎం ఇన్సాస్ తుపాకుల స్థానంలో బులెట్ తగిలితే, ప్రాణాలు పోయే 7.62/51 ఎంఎం అసాల్ట్ రైఫిల్స్ అందించాలని చూస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో సేవలందిస్తున్న జవాన్లు 7.62 ఎంఎం ఏకే-47లను వాడుతున్నారు. ఇండియా తక్షణ అవసరాలు తీర్చేందుకు 1.85 లక్షల 7.62 అసాల్ట్ రైఫిల్స్, 1.6 లక్షల కార్బైన్స్, 16 వేల 7.62 లైట్ మెషీన్ గన్స్, 3,500 స్నిప్పర్ రైఫిల్స్ అవసరముందని అంచనా.

  • Loading...

More Telugu News