: ‘మన టీవీ’ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ: కేటీఆర్ సమక్షంలో కుదిరిన కీలక ఒప్పందం
భారత ప్రతిష్టను ఇస్రో అన్ని దేశాల ముందు చాటుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 'మన టీవీ' ద్వారా తెలంగాణలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కార్యక్రమంపై ఇస్రోతో కుదుర్చుకున్న ఎంవోయూపై కేటీఆర్ సమక్షంలో ఈరోజు అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇస్రో అందిస్తున్న పరిజ్ఞానంతో మనటీవీ ద్వారా పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రోజుకి నాలుగు గంటల సమయం ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు శిక్షణ కొనసాగుతుందని ఆయన అన్నారు. దీని వల్ల ఎందరో విద్యార్థులు లాభపడతారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు మనటీవీ కార్యక్రమాలు అందేలా చూస్తామని చెప్పారు. తెలంగాణలోని ఆరు వేల స్కూళ్లలో డిజిటల్ పాఠాలు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో పోటీ పరీక్షలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకే కాకుండా రైతులకి కూడా శిక్షణనిచ్చే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆధునిక సాగుపద్ధతులపై టీవీ ద్వారా శిక్షణనందించనున్నట్లు తెలిపారు.