: ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. చివరికి ఆమెపైనే దాడి చేసిన యువకుడు!
ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసిన యువకుడు బండారం బయటపడిందని తెలిసి బాలిక కుటుంబంపై కత్తితో దాడిచేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుందీ ఘటన. నగరానికి చెందిన అమిత్ యాదవ్(24) ఫేస్బుక్లో అధర్వ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల ప్రియా రావత్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తరచూ చాటింగ్ చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత అధర్వ అమ్మాయి కాదని, అమిత్ యాదవ్ అనే యువకుడని తెలుసుకున్న ప్రియ అతడితో చాటింగ్ చేయడం మానేసింది. ప్రియ చాటింగ్ మానేయడంతో ద్వేషం పెంచుకున్న అమిత్ గీతానగర్‌లోని ప్రియ ఇంటికి వచ్చి నిలదీశాడు. తనతో చాటింగ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు. అమ్మాయివనుకుని చాటింగ్ చేశానని, అబ్బాయి అని తెలిసి మానేశానని ప్రియా చెప్పింది. అసలు నువ్వు ఎవరో తనకు తెలియదని చెప్పింది. దీంతో అప్పటికే కోపంతో రగిలిపోతున్న అమిత్ వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియపై దాడిచేశాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపైనా దాడికి తెగబడ్డాడు. అనంతరం ప్రియ ఇంటి రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయేందుకు అమిత్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి కాళ్లు విరిగినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తళ్లీకూతుళ్లతోపాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.