: మొన్న ఢిల్లీ మీటింగులో కేసీఆర్ నా మాటను గౌరవించారు: చంద్రబాబు
గత వారంలో న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేళ జరిగిన ఓ ఆసక్తికర ఘటనను చంద్రబాబు తమ మంత్రులతో పంచుకున్నారు. కేసీఆర్ తన మాటను గౌరవించారని చెప్పుకొచ్చారు. పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల ప్రస్తావన వచ్చిన సమయంలో వాటికి అనుమతులు లేవని తాను స్పష్టం చేసిన వేళ, కేంద్ర అధికారులు సైతం అదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ అధికారులు తమ వద్ద కొన్ని జీవోలు ఉన్నాయని చెప్పడంతో, కేంద్ర అధికారులు కల్పించుకుని తమ నుంచి ఎలాంటి అనుమతులూ పొందలేదు కాబట్టి ఆ జీవోలన్నీ చెల్లవని స్పష్టం చేశారట. దీంతో తీవ్ర ఆగ్రహంతో కేసీఆర్ బయటకు వెళ్లిపోగా, స్పందించిన తాను "సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. వచ్చి కూర్చోండి" అని సర్దిచెబితే, తన మాటకు గౌరవమిస్తూ, ఆయన తిరిగి వచ్చారని మంత్రులకు చంద్రబాబు చెప్పారు. తనకున్న సీనియారిటీని అందరూ గౌరవించారని సహచరులతో ఆనందంగా చెప్పినట్టు సమాచారం.