: ఆసుపత్రిలోనూ ప్రజా సంక్షేమమే... బెడ్ పైనే ఉండి మంత్రులతో 'అమ్మ' సమీక్ష
ప్రస్తుతం జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, అనారోగ్యంలోనూ ప్రజా సంక్షేమాన్ని వదల్లేదు. కావేరీ నీటి విషయంలో వివాదం తీవ్రమవుతున్న వేళ, ఆసుపత్రి బెడ్ పై నుంచే మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశం నిర్వహించాల్సివుండగా, దానికి తన బదులుగా ప్రజా పన్నుల శాఖ మంత్రి పళనిస్వామిని పంపుతూ, తన తరఫున మాట్లాడాలని కోరారు. గడచిన మూడు రోజుల్లో 107 అమ్మ క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయని మంత్రులు ఆమెకు గుర్తు చేశారు. ఆసుపత్రి నుంచే ఉచిత వైఫై జోన్ల పథకాన్ని జయలలిత ప్రారంభించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వేళ, ప్రచారం జరుగుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. కాగా, నేటికి వారం రోజులుగా జ్వరం, డీహైడ్రేషన్ లకు చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఆమెను సింగపూర్ కు తరలిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపారు.