: ఒత్తిళ్లకు తలొగ్గొద్దు, కూల్చి పడేయ్.. కేటీఆర్‌కు రెండుసార్లు ఫోన్ చేసి చెప్పిన కేసీఆర్
అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో ఎవరినీ వదిలిపెట్టవద్దని, ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్‌కు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేయాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. భారీ వర్షాల కారణంగా నగరంలో తలెత్తిన పరిస్థితులపై మంత్రి కేటీఆర్ మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన సమీక్షలో ఉండగానే సీఎం కేసీఆర్ రెండుసార్లు కేటీఆర్‌కు ఫోన్ చేశారు. ఒత్తిళ్లకు లొంగకుండా పనిపూర్తిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని కమిషనర్ చిరంజీవులను ఫోన్‌లోనే ఆదేశించారు. ఒక్క నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలపై దృష్టి సారించాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్ కూల్చివేతల పురోగతిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎన్నింటిని కూల్చివేశారు? మున్ముందు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? తదితర వివరాలు అడిగి తెసుకున్నారు. మంత్రి కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని అధికారులకు నొక్కి చెప్పారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా కూల్చివేతలు పూర్తిచేయాలని ఆదేశించారు.