: పిల్లనిచ్చిన మామనే కాదు, ఓట్లేసిన వారినీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: వైఎస్ జగన్
పిల్లనిచ్చిన మామనే కాదు, తనకు ఓట్లేసిన వారిని కూడా సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఇటువంటి సీఎం దేశంలో ఎక్కడా ఉండరని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా రెడ్డిగూడెంలో వరదబాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఎక్కడా పర్యటించలేదని, ఆయన ఇక్కడికి వస్తే ప్రజల ఇబ్బందులేమిటో తెలిసేవని అన్నారు. టీవీల్లో కనిపించడం కోసం చంద్రబాబు హెలికాఫ్టర్ లో తిరిగారని విమర్శించారు. వరద ప్రభావిత గ్రామాల్లోకి ఒక్క అధికారి కూడా రాలేదని, దమ్మిడి సాయం చేయలేదని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో 3 లక్షల ఎకరాల పత్తి, లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల్లో మిరప వేశారని, అందులో సగభాగం మునిగిపోయిందని జగన్ అన్నారు. గత సంవత్సరం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదని, రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. బంగారంపై తీసుకున్న రుణాలను రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు బంగారంపై రుణాలు ఇవ్వవద్దని చెబుతున్నారని, రైతులకు బ్యాంకులు రుణాలివ్వక, అప్పులు దొరకనీయకుండా చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు అండగా నిలవాలని జగన్ సూచించారు.