: పెద్ద కంపెనీలు నష్టపోయిన వేళ... లాభాలను పండించుకున్న చిన్న కంపెనీలు!
భారత స్టాక్ మార్కెట్ నష్టాలు ఈ రోజు కూడా కొనసాగాయి. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే లాభాల్లో ఉన్న బెంచ్ మార్క్ సూచికలు, మధ్యాహ్నం తరువాత ఒత్తిడిలో కూరుకుపోయాయి. ముఖ్యంగా యూరప్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడం, రేపు సెప్టెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ ముగింపు ట్రేడింగ్ డే కావడంతో నూతన కొనుగోళ్లవైపు ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇదే సమయంలో స్మాల్, మిడ్ క్యాప్ రంగాల్లోని కంపెనీలు అత్యధికం లాభాల బాటలో నడిచాయి. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 70.58 పాయింట్లు పడిపోయి, 0.25 శాతం నష్టంతో 28,223.70 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 16.65 పాయింట్లు పడిపోయి 0.19 శాతం నష్టంతో 8,706.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.11 శాతం, స్మాల్ కాప్ 0.13 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 20 కంపెనీలు లాభపడ్డాయి. అరవిందో ఫార్మా, టీసీఎస్, అంబుజా సిమెంట్స్, విప్రో, లుపిన్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, హిందాల్కో, బీపీసీఎల్, ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,899 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,254 కంపెనీలు లాభాలను, 1,430 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,11,34,699 కోట్లకు తగ్గింది.