: బలహీనపడ్డ అల్పపీడనం... కోలుకుంటున్న కోస్తా, తేరుకుంటున్న భాగ్యనగరి
దాదాపు పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు ఇప్పుడు శాంతిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడులో గత రాత్రి అక్కడక్కడా పడ్డ స్వల్ప వర్షపాతం మినహా నేడు ఎక్కడా వర్షం కురవలేదు. హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి సూర్యుడు కూడా బయటకు వచ్చాడు. నీట మునిగిన పలు కాలనీల్లోని అపార్టుమెంట్ల నుంచి నీటి తొలగింపు పనులు కూడా పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుండటంతో భాగ్యనగరి మెల్లమెల్లగా తేరుకుంటోంది. ఇదే సమయంలో విదర్భ, తెలంగాణ, కోస్తాల మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తన ద్రోణి ఉండటంతో, కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే, కుంభవృష్టి కురిసే అవకాశాలు లేవని, రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆపై వర్షాలు అంతగా కురవకపోవచ్చని అంచనా వేశారు. ఇక భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న పిడుగురాళ్ల - నడికుడి రైలు మార్గం పునరుద్ధరణ శరవేగంగా సాగుతోంది. రేపటి నుంచి రైళ్లను నడిపే అవకాశాలున్నాయని, శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి అన్ని సర్వీసులనూ పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. నదులను తలపిస్తూ, పొంగి పొర్లిన నాగులేరు, చంద్రవంకలు సాధారణ స్థితికి వచ్చాయి. రహదారులపై వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరడంతో కోస్తాంధ్ర కోలుకుంటోంది.