: అశ్విన్ వెలకట్టలేని క్రికెటర్ ... ఆకాశానికెత్తిన కోహ్లీ
టీమిండియాకు గత కొంత కాలంగా విజయాలు కట్టబెడుతున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. న్యూజిలాండ్ పై ప్రతిష్ఠాత్మక 500వ మ్యాచ్ లో విజయం అందించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, అశ్విన్ వెలకట్టలేని క్రికెటర్ అన్నాడు. క్రికెట్ పై ప్రభావం చూపే ఆటగాళ్లలో అశ్విన్ టాప్ 3లో ఉంటాడని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడడంలో అశ్విన్ శైలే వేరని ఆకాశానికెత్తేశాడు. కొన్నేళ్లుగా అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని కితాబునిచ్చాడు. అవసరమైన ప్రతిసారి అశ్విన్ బంతి, బ్యాటుతో సత్తాచాటుతాడని కోహ్లీ తెలిపాడు. ప్రతిష్ఠాత్మక టెస్టులో మొత్తం 20 వికెట్లలో అశ్విన్, జడేజా ద్వయం 16 వికెట్లు తీయగా, అశ్విన్ 10 వికెట్లు తీసి సత్తాచాటాడని గుర్తుచేశాడు. తొలి ఇన్నింగ్స్ లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ 40 పరుగులు చేశాడని తెలిపాడు. మరోపక్క పూజారా కూడా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించాడని కోహ్లీ తెలిపాడు.