: ఓపెనింగ్ కోసం గంభీర్ కు కబురుపెట్టండన్న చీఫ్ కోచ్!
ఎన్నాళ్లో వేచిన ఉదయం... ఈనాడే నిజమౌతుంటే... అంటూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాడుకునే సమయం ఆసన్నమయింది. ఎందుకంటే, గంభీర్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న కల నేరవేరబోతోందని సమాచారం. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడ్డ తరుణంలో ప్రత్యామ్నాయం కోసం చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రంజీలు, ఐపీఎల్ తో మంచి ఫాంలో ఉన్న గౌతమ్ గంభీర్ కు కబురుపెట్టాలని బీసీసీఐకి సూచించినట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో 2014లో జరిగిన టెస్ట్ లో పేలవమైన బ్యాటింగ్ తో టీమిండియాలో చోటు కోల్పోయిన గంభీర్ మళ్లీ జట్టులో చోటు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే సమయంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. అయినప్పటికీ అతనిని సెలెక్టర్లు కనికరించలేదు. ఈ నేపథ్యంలో అతని మాజీ సహచరుడు, అనిల్ కుంబ్లే అతని ప్రతిభపై నమ్మకముంచి అవకాశం కల్పించాలని భావించాడు. దీంతో కోల్ కతాలో న్యూజిలాండ్ తో ఆడనున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సబ్ గా ఉన్న శిఖర్ ధావన్ జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి కుంబ్లే స్థానం కల్పిస్తాడో చూడాలి. కాగా, గతంలో గంభీర్, కోహ్లీ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే.