: కాశ్మీర్ తో పాటు బీహార్ ను కూడా తీసుకోవాలంటూ సుప్రీం మాజీ న్యాయమూర్తి పాకిస్థాన్ కు ఆఫర్.. విమర్శలతో 'జోకు' అంటూ వివరణ!


‘నేను చాలా మందిపై జోకులు వేస్తుంటాను. పాకిస్థాన్ కు బంపర్ ఆఫర్ అంటూ నేను చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాంటివే’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు పేర్కొన్నారు. పాకిస్థాన్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్నానని.. కాశ్మీర్ తో పాటు బీహార్ ను కూడా తీసేసుకోవాలంటూ ఆయన చేసిన ట్వీట్ పెద్ద దుమారం లేపింది. దేశం ద్రోహం నేరం కింద మార్కండేయ కట్జుకు శిక్ష విధించాలని కొంతమంది నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కట్జు తాను చేసిన ట్వీట్ ను సీరియస్ గా తీసుకోవద్దని, ప్రజలకు సెన్సాఫ్ హ్యుమర్ పెరగాలని కట్జు సూచించారు. కట్జు తన ట్వీట్లలో ఇంకా ఏమన్నారంటే... తనకు ఇప్పుడే పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చిందని, కావాలంటే కాశ్మీర్ ను వదులుకుంటాం గాని, బీహార్ మాత్రం తమకు వద్దన్నారని పేర్కొన్నారు. కాశ్మీర్ కావాలని అడిగినందుకు పాకిస్థాన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పిందని, భవిష్యత్తులో ఎప్పుడూ అలా కోరుకోమని హామీ ఇచ్చారంటూ ఆ సరదా ట్వీట్ లో పేర్కొన్నారు. అలహాబాద్ యూనివర్శిటీలో తాను చదువుకునే సమయంలో తమ ఇంగ్లీషు అధ్యాపకుడు ఫిరాఖ్ గోరఖ్ పురి తనకు చెప్పిన ఒక విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ‘భారతదేశానికి పాకిస్తాన్ తో ఎటువంటి ముప్పులేదు గానీ, బీహార్ తోనే ఉందన్నారు’ అని కట్జు పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో కట్జు ప్లేటు మార్చారు. బీహారీలంటే తనకు ఎంతో గౌరవం అని, గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రం నుంచి వచ్చారంటూ కట్జు తనదైన శైలిలో సమర్థించుకున్నారు. కాగా, ఈ ట్వీట్ల నేపథ్యంలో బీహార్ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి వినోద్ నారాయణ్ ఝా ఘాటుగా స్పందించారు. భారత దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు, జాతి వ్యతిరేక శక్తులతో కట్జు చేతులు కలిపారనే అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కట్జుపై దేశ ద్రోహం కేసు పెట్టాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News