: గ్యాంగ్‌స్టర్‌లకు స్థానం లేదు.. ఉపేక్షించకుండా జైలుకి పంపిస్తాం: బీహార్ సీఎం నితీశ్
రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు అనుభవిస్తున్న ఆర్జేడీ నేత, మాజీ ఎంపీ షాబుద్దీన్‌కి బెయిల్ లభించి, ఇటీవలే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశమే ప్రస్తుతం బీహార్లో చర్చనీయంగా మారింది. అయితే, ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈరోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన సందర్భంగా పలు అంశాలను స్పష్టం చేశారు. ప్రధానంగా డాన్‌ల అంశంపై ఆయన మాట్లాడుతూ... తమ రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్‌లకు స్థానం లేదని అన్నారు. అటువంటి వారిని ఉపేక్షించకుండా జైలుకి పంపించేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంలో తాము రాజీపడబోమని అన్నారు. మరోవైపు షాబుద్దీన్‌కు బెయిల్ రద్దు చేయాలని బీహార్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరుపుతున్న కోర్టుముందు షాబుద్దీన్ తన కేసు విచారణకు మరింత సమయం కావాలని కోరాడు. అయితే ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ ఎందుకు ఉపసంహరించరాదో రేపటిలోగా తెలపాలని ఆదేశించింది.