: ట్విట్టర్ ను సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగిన డిస్నీ
సామాజిక మాధ్యమ దిగ్గజంగా పేరున్నప్పటికీ, ఆదాయ సముపార్జనలో విఫలమవుతూ వస్తున్న, ట్విట్టర్ ను అమ్మకానికి పెట్టడంతో, దానిని సొంతం చేసుకునేందుకు మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ రంగంలోకి దిగింది. ఈ మేరకు 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ఇస్తూ, ట్విట్టర్ ను సొంతం చేసుకోవడంలో డిస్నీ సఫలమైతే, సంస్థకు ఇదే అతిపెద్ద టెక్ డీల్ అవుతుందని పేర్కొంది. కాగా, ఇప్పటికే ట్విట్టర్ సంస్థ వివిధ రకాల ఆటలను తన యాప్ ద్వారా స్ట్రీమింగ్ చేయడానికి పెట్టుబడులు పెట్టింది. ఇదే సమయంలో డిస్నీ సైతం తామందిస్తున్న ఈఎస్పీఎన్ చానళ్లతో పాటు ఓ యాప్ ను విడుదల చేసి స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఇక ట్విట్టరే అందుబాటులోకి వచ్చిన వేళ, దాన్ని కొనుగోలు చేస్తే, తమ స్మార్ట్ ఫోన్ సేవలను మరింతగా విస్తరించుకోవచ్చన్నదే డిస్నీ ఆలోచనగా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇదిలావుండగా ట్విట్టర్ ను కొనేందుకు గూగుల్, వేరీజోన్ సంస్థలో పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్టు తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఆపై తమకు ఆ ఆలోచన లేదని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దాదాపు 31.3 కోట్ల మంది యాక్టివ్ వాడకందారులున్న ట్విట్టర్ లో గత కొంతకాలంగా యూజర్ల వృద్ధి మందగించిన నేపథ్యంలో సంస్థ ఒత్తిడిలో పడిపోయింది.