: జైలు క్యాంటీన్ లో పాన్ షాపు పెట్టాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఖైదీలు
తాము జైల్లో పాన్ తినేందుకు అనుమతించాలని, జైలులో పాన్ షాప్ లేదా క్యాంటీనులో తమలపాకులు, వక్కలు తదితరాలు విక్రయించేందుకు అంగీకరించాలని కోరుతూ గౌహతి సెంట్రల్ జైలుకు చెందిన 11 మంది ఖైదీలు హైకోర్టును ఆశ్రయించారు. పలు నేరాల్లో కఠిన శిక్షలు అనుభవిస్తున్న వీరంతా ఈ మేరకు రిట్ పిటిషన్ వేశారు. పాన్ నమిలితే తాము పునరుత్తేజితం అవుతామని వీరు తెలిపారు. కాగా, తాము పాన్ తినేందుకు అనుమతించాలని గత సంవత్సరం అక్టోబర్ లో 413 మంది ఖైదీలు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కామ్ రూప్ (రూరల్)ను ఆశ్రయించగా, ఆయన ఖైదీల కోరికను తోసిపుచ్చారు. దీంతో వారిలో 11 మంది ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.