: చికెన్ పిజ్జా కోసం ఆర్డర్ చేసిన మహిళకు పిజ్జా బాక్స్ లో ఐదువేల డాలర్లొచ్చాయి !
ఏ మాత్రం కష్టపడకుండా డబ్బు వచ్చి కళ్లముందు చేరితే ఏం చేస్తాం..? ఎగిరి గంతేస్తాం, ఎవరికీ చెప్పకుండా దాచుకుంటాం. అయితే, కొందరు మాత్రం ఉచితంగా ఏది వచ్చినా తీసుకోరు. పరుల సొమ్మును పాములాగే భావిస్తారు. దొరికిన డబ్బుతో ఎంజాయ్ చేయకుండా ఆ డబ్బు ఎవరిదో తెలుసుకొని అప్పజెప్పేస్తారు. కాలిఫోర్నియాకు చెందిన ‘సెలీనా’ అనే ఓ మహిళది కూడా అటువంటి దృక్పథమే! సెలీనాకు పిజ్జాలంటే చాలా ఇష్టం. ఓ సారి చికెన్ పిజ్జా కోసం ‘డొమినోస్ పిజ్జా’కు ఫోను చేసి ఆర్డర్ చేసింది. పిజ్జా డబ్బాలో చికెన్ పిజ్జా తీసుకొని పిజ్జా బాయ్ ఆమెకు ఇచ్చి వెళ్లిపోయాడు. పిజ్జాను ఎంచక్కా తినేద్దామని ఆమె ఆ బాక్స్ తెరిచిచూసి షాక్ అయింది. అందులో పిజ్జాకి బదులుగా నోట్ల కట్టలు ఉన్నాయి. అందులో మొత్తం 5 వేల డాలర్లు (సుమారు రూ.3లక్షలు) ఉన్నాయి. అయితే, సెలీనా ఆ పరాయి డబ్బు కోసం ఆశపడలేదు. ఆ డబ్బు ఎవరిదో వారికి తిరగి ఇచ్చేయాలని భావించింది. ‘డొమినోస్ పిజ్జా’ ఆఫీసుకి మళ్లీ ఫోను చేసింది. తనకు పిజ్జాకు బదులుగా డబ్బు వచ్చిందని జరిగిన విషయాన్ని తెలిపింది. ఆమె మంచితనాన్ని మెచ్చుకున్న డొమినోస్ యాజమాన్యం ఏడాదిపాటు ఆమెకు డొమినో పిజ్జాను ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఇంతకీ, పిజ్జా బాక్స్‌లోకి ఆ డబ్బు ఎలా వచ్చిందంటే.. ఆ డబ్బంతా డొమినో పిజ్జా యజమానిది. ఆయన బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకొని పిజ్జా కేంద్రానికి వచ్చి అక్కడ తన పనిచేసుకుంటున్నాడు. ఎటో ఆలోచిస్తూ ఓ పిజ్జా బాక్స్‌లో పొరపాటున పిజ్జాకి బదులుగా ఆయన ఆ డబ్బులు పెట్టేశాడు. ఇంతలో ఆ బాక్సు సెలీనాకు పంపించేశారు.