: సరబ్ జిత్ వ్యవహారంపై పనికిమాలిన రాజకీయాలు మానుకోండి : కేంద్రం
పాకిస్థాన్ లోని జిన్నా ఆసుపత్రిలో కోమాలో ఉన్న భారత ఖైదీ సరబ్ జిత్ వ్యవహారంలో పనికిమాలిన రాజకీయాలు చేయవద్దని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా ప్రతిపక్షాలకు సూచించారు. ఇటువంటి సమయంలో అతని కుటుంబానికి సహాయం చేసేందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ అంశంలో కొంతమంది రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని శుక్లా ఆరోపించారు. ఇదంతా పక్కనపెట్టి కలిసి రావాలన్నారు.
సరబ్ జిత్ కేసులో భారత ప్రభుత్వం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. పాక్ లోని భారత హై కమిషన్ అధికారులు ఆ దేశాధికారులను ప్రతినిత్యం సంప్రదిస్తూనే ఉన్నారని, ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారని పేర్కొన్నారు. కాగా, దీనిపై సమాచార ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ మాట్లాడుతూ.. హత్యాయత్న దాడి జరిగిన సరబ్ జిత్ పై రాజకీయ నాయకుల స్పందనలు జాగ్రతగా ఉండాలని సూచించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఖండించదగినదన్నారు. పాక్ లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా భారత హై కమిషన్ నుంచి వస్తున్న స్పందన కూడా బాగానే ఉందని తివారీ చెప్పారు.