: దిగొచ్చిన పాక్ నటుడు.. భారత్‌కు క్షమాపణలు


ట్విట్టర్‌లో భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి టీవీ సీరియల్ నుంచి ఉద్వాసనకు గురైన బ్రిటన్‌లోని పాక్ సంతతి టీవీ నటుడు మార్క్ అన్వర్ ఎట్టకేలకు దిగొచ్చాడు. చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. తన వ్యాఖ్యలను ఎవరూ హర్షించలేదని, పైగా భారతీయుల మనసులు గాయపడ్డాయని పేర్కొన్న అన్వర్, తన ప్రతీ వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇటీవల ఉరీ ఘటనపై స్పందిస్తూ అన్వర్ ట్విట్టర్‌లో వరుస వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాక్ నటులు డబ్బుల కోసం భారత్‌లో ఉండడం సరికాదని పేర్కొంటూ వారు వెంటనే పాక్ వచ్చేయాలని కోరిన అన్వర్ ఓ మొరటు మాటను ఉపయోగించాడు. మరో ట్వీట్‌లోనూ మొరటి మాటలతో భారత్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యాఖ్యలను ఐటీవీ తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ అన్వర్ నటిస్తున్న టీవీ సీరియల్ నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన అన్వర్ క్షమాపణలు వేడుకున్నాడు. తన పొరపాట్లను పెద్ద మనసుతో క్షమించాలని వేడుకున్నాడు. తాను ఆవేశంతో అలా చేశానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని వివరణ ఇచ్చుకున్నాడు. కాగా అన్వర్ వ్యాఖ్యలపై లండన్ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News