: సాధారణ స్థితికి భాగ్యనగరం.. ముంపు ప్రాంతాల బాధితులకు ఉపశమనం
ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరం కాస్తంత తెరిపిన పడింది. సోమవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నగరంలోని ముంపు ప్రాంతాల వాసులకు ఉపశమనం లభించింది. గత వారం, పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని నిజాంపేట, బేగంపేట, ఆల్విన్ కాలనీ, అల్వాల్, చింతల్, నాచారం తదితర ప్రాంతాలు నీటమునిగిన సంగతి తెలిసిందే. జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలా ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో కళకళలాడిన హుస్సేన్ సాగర్లోనూ నీటి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. నిజాంపేటలోని బండారీ లే అవుట్ మాత్రం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. కాలనీ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. బాధిత కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నారు.