: మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేకపోతున్నా... క్షమించండి: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మిడ్‌మానేరు నిర్వాసితులకు క్షమాపణలు చెప్పారు. తాను వేములవాడ వచ్చినప్పుడు నిర్వాసితులకు డబుల బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చానని, కానీ ఇప్పుడు అది నిలబెట్టుకునే అవకాశం లేదంటూ క్షమాపణలు కోరారు. నిర్వాసితులకు ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీలో ఇళ్లు మంజూరు చేసినందున డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసే పరిస్థితి లేదని వివరించారు. ఇందుకు తనను క్షమించాలని కోరారు. ప్రస్తుతం కొత్తగా భూసేకరణ చేస్తున్న ప్రాంతంలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. ‘‘ఆ రోజు అవగాహన లేకపోవడం వల్లే డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఇచ్చా. మిడ్ మానేరు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కింద ఇళ్లు మంజూరు చేశాం. కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఆడిట్‌లో సమస్యలు వస్తుండడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశం లేదు’’ అని కేసీఆర్ వివరించారు. నిర్వాసితులు పెద్దమనసుతో తనను అర్థం చేసుకుని క్షమించాలని కోరారు. అయితే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.