: హిల్లరీ, ట్రంప్ మధ్య ప్రారంభమైన తొలి డిబేట్.. కొనసాగుతున్న మాటల యుద్ధం!


అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ప్రారంభమైన చర్చ వాడివేడిగా సాగుతోంది. మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా తలపడుతున్న వీరిద్దరు పలు అంశాలు, సమస్యలను ప్రస్తావించారు. అమెరికా దశదిశ, ప్రజల భద్రత, శ్రేయస్సు అంశాలపై చర్చ జరుగుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనకు దేశంలో ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. దృఢమైన, స్థిరమైన అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. నిర్మాణరంగం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ఉద్యోగ వృద్ధి సాధించామన్నారు. తాను అధికారంలోకి వస్తే కార్పొరెట్ లొసుగులు తొలగిస్తానని హామీ ఇచ్చారు. సంపన్నులకు పన్ను తగ్గింపులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు వివరించారు. సామాన్యులు, మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. తన ఈమెయిల్స్ పొరపాటున డిలీట్ అయ్యాయని వివరణ ఇచ్చారు. మీ భవిష్యత్‌ను ఎవరు తీర్చిదిద్దగలరో చూడాలని కోరారు. కార్పొరెట్ లొసుగుల వలన ఎక్కువగా లాభపడింది ట్రంప్ కుటుంబమేనని ఆరోపించారు. మధ్యతరగతిపై ఖర్చులు పెరగాల్సిన అవసరం ఉందని హిల్లరీ పేర్కొన్నారు. దేశంలో అందరినీ సమానంగా గౌరవించాలని అన్నారు. పోలీసులు, కమ్యూనిటీల మధ్య సయోధ్య పెంచాల్సిన అవసరముందని హిల్లరీ నొక్కి చెప్పారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చైనా, మెక్సికో, ఇండియా వంటి దేశాలు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయన్నారు. కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సిన అవసరముందని, అప్పుడే కొత్త సంస్థలు వస్తాయని అభిప్రాయపడ్డారు. హిల్లరీకి ఎలాంటి ప్రణాళిక లేదని తూర్పారబట్టారు. గత 30 ఏళ్లలో హిల్లరీ ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్‌పైనా పోరాటం చేయలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం హిల్లరీ పరిష్కారాల గురించి మాట్లాడతున్నారని అన్నారు. ఉద్యోగాలను వెనక్కి తీసుకురాగలిగే సామర్థ్యం తనకు ఉందని, హిల్లరీకి లేదని తేల్చి చెప్పారు. హిల్లరీ 30వేల ఈమెయిల్స్‌ను డిలీట్ చేశారని ఆరోపించారు. హిల్లరీ ట్యాక్స్ విధానాల వలన దేశానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని ట్రంప్ అన్నారు.

  • Loading...

More Telugu News