: రజనీకాంత్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారు: రజనీ సోదరుడు సత్యనారాయణ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్ర పరిశ్రమకు అంకితమని, ఎప్పటికీ రాజకీయాల్లోకి రాబోరని రజనీ సోదరుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని ఈరోజు ఆయన తన కుటుంబసభ్యులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని, సంపూర్ణంగా కోలుకోవాలని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ సమస్యకు శాంతియుత పరిష్కారం లభించాలని దేవుడిని ప్రార్థించానని, కలశాభిషేకం చేశానని చెప్పారు. తన సోదరుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదనే నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారని, ప్రస్తుతం ‘రోబో’ సీక్వెల్ చిత్రం పనుల్లో రజనీ బిజీగా ఉన్నారని సత్యనారాయణ చెప్పారు.