: సరికొత్త 'అచీవర్ 150'ని విడుదల చేసిన హీరో మోటో... ధర రూ. 62,800
100, 125 సీసీలో దేశంలో అత్యధిక బైక్ లను విక్రయించిన సంస్థగా ఉన్న హీరో మోటో, సోమవారం నాడు 'అచీవర్ 150' పేరిట సరికొత్త బైక్ ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ ఈ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 61,800, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 62,800 (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) అని ఆయన తెలిపారు. 150 సీసీ సెగ్మెంట్ లో పోటీలో ఉన్న బైక్ ధరలతో పోలిస్తే, అచీవర్ 150 ధర తక్కువని ఆయన తెలిపారు. ఈ బైక్ ను సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ టీమ్ జైపూర్ లో అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రస్తుతం 100 సీసీ సెగ్మెంట్ లో 65 శాతం, 125 సీసీ సెగ్మెంట్ లో 55 శాతం మార్కెట్ వాటా తమదేనని, దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా హీరో బైక్ లు తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. 7 కోట్ల వాహనాలను విక్రయించిన సందర్భంగా స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసే కలర్ థీమ్ తో 70 అచీవర్ బైక్ లను తయారు చేశామని పవన్ ముంజాల్ వెల్లడించారు. బీఎస్-4 నిబంధనలను పాటించేలా ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ 150 సీసీ ఇంజన్ దీనిలో ఉందని, 5 సెకన్ల వ్యవధిలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. ప్యాంథర్ బ్లాక్ మెటాలిక్, కాండీ బ్లేజింగ్ రెడ్, ఎబోనీ గ్రే మెటాలిక్ రంగుల్లో లభిస్తుందని తెలిపారు. డిజిటల్ స్పీడో మీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, అదనపు ఆకర్షణలని వెల్లడించారు.