: భర్తను హత్య చేసి, శవాన్ని బైక్ పై వేసుకుని 12 కిలోమీటర్లు ప్రయాణించిన హైదరాబాద్ యువతి!


భర్తను హత్య చేసి, ఆపై ఓ మైనర్ బంధువు సాయంతో మృతదేహాన్ని 12 కిలోమీటర్ల దూరం పాటు బైక్ పై తీసుకెళ్లిన ఓ హైదరాబాద్ యువతిని పోలీసులు రెండు కిలోమీటర్ల దూరం వెంటాడి పట్టుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మండెం ప్రవల్లిక (25) తన భర్త పుల్లయ్య తలను గోడకేసి బాది, మర్మావయవాల మీద బలంగా కొట్టి హత్య చేసింది. ఆపై పక్కింటి వాళ్ల బైక్ ను తీసుకుని శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో 16 ఏళ్ల దగ్గరి బంధువైన యువకుడి సాయంతో శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని బయలుదేరింది. నాగేశ్వరరావు, మహేందర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు బైక్ పై ముగ్గురు వెళుతుండటం చూసి అనుమానంతో ఆపాలని కోరినా, ఆపకుండా వీరు వెళ్లిపోయారు. మధ్యలో కూర్చున్న వ్యక్తి కాళ్లు నేలపై జారాడుతుండటం, అతని తల యువకుడిపై వాలిపోయి ఉండటాన్ని గమనించి, రెండు కిలోమీటర్ల పాటు వారిని వెంబడించి అడ్డుకున్నారు. తొలుత మద్యం సేవించేందుకు వెళ్లిన తన భర్త విగతజీవిగా కనిపిస్తే తీసుకెళుతున్నామని చెప్పిన ప్రవల్లిక, ఆపై తమదైన శైలిలో విచారిస్తే నిజం ఒప్పుకుంది. ఈ జంట నల్గొండ జిల్లా కోదాడ నుంచి కొద్ది వారాల క్రితమే వచ్చారని, ఆమెకు అల్లుడి వరసైన పదవ తరగతి చదువుతున్న యువకుడితో అక్రమ సంబంధముందని, అదే హత్యకు దారితీసిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News