: హైదరాబాద్ లో అక్రమకట్టడాలపై కొరడా ఝుళిపిస్తున్న తెలంగాణ సర్కార్
హైదరాబాద్ నగరంలో పడిన భారీ వర్షాల కారణంగా నగరంలోని పలుచోట్ల ఇళ్లలోకి, అపార్ట్ మెంట్లలోకి నీరు చేరిన సంగతి తెలిసిందే. నాలాలను ఆక్రమించి అపార్టుమెంటులు నిర్మించిన కారణంగానే వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకుంది. దీంతో తెలంగాణ సర్కార్ ఆక్రమణలను కూల్చివేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. నగరంలోని శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్న నాలాలను పరిశీలించిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిపై నిర్మించిన ఆక్రమణలను తొలగిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ పరిధిలోని స్వరూప్‌నగర్ మూసీ నాలాపై కూడా నిర్మాణాలను పడగొట్టారు. నాలాలపై ఆక్రమణలు జరపడంతో అక్కడి ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ సిబ్బంది రామంతాపూర్, చిలుకానగర్ ప్రాంతాల్లోని నాలాలపై నిర్మించిన నిర్మాణాలను కూడా తొలగించనున్నారు.