: క్రస్ట్ గేట్ల వరకూ నీరు... నిండుకుండలా శ్రీశైలం, రెండేళ్ల తరువాత తెరచుకోనున్న గేట్లు
2014 సెప్టెంబర్ తరువాత తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరచుకోనున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిండిన ఆల్మట్టి, జూరాల రిజర్వాయర్లకు వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతుండగా, 1,40,214 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 885 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టమున్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 881 అడుగుల మేరకు నీరు చేరింది. వరద నీరు డ్యామ్ క్రస్ట్ గేట్లను తాకి పెరుగుతోంది. ఎగువ నుంచి మరింత వరద వస్తోందన్న సమాచారంతో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో పనిచేయిస్తున్న అధికారులు 73 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక వస్తున్న వరదలో 67 వేల క్యూసెక్కుల నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ వేగంతో నీటిని నిల్వ చేస్తే, రోజుకు ఆరు టీఎంసీల చొప్పున నీరు పెరుగుతుంది. నేటి రాత్రికి ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు చేరవచ్చన్న అంచనాలున్న నేపథ్యంలో మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి శ్రీశైలం రిజర్వాయర్ చేరుతుంది. ఆపై గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు వదులుతామని డ్యాం నిర్వహణ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 518 అడుగుల మేరకే నీరుంది. పై నుంచి భారీ ఎత్తున వరద వస్తే తప్ప సాగర్ పూర్తిగా నిండే అవకాశాలు లేవు. అయితే, బంగాళా ఖాతంలో మరో అల్పపీడనానికి అవకాశం ఉండటం, గడచిన వారం రోజులుగా ఇబ్బంది పెట్టిన ఉపరితల ఆవర్తనం, ఎగువ కర్ణాటక, విదర్భ ప్రాంతాలకు వెళ్లడంతో, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కర్ణాటకలో మరిన్ని వర్షాలు కురిస్తే, ఈ వారాంతంలోనే శ్రీశైలం గేట్లు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.