: ఉగ్రవాది బుర్హాన్ వని భారత సైన్యంలో చేరాలనుకున్నాడట.. క్రికెటర్ కూడా కావాలనుకున్నాడట!
భారత జవాన్ల చేతిలో ఇటీవలే హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తండ్రి ముజఫర్ వని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కుమారుడి గురించి పలు విషయాలు పేర్కొన్నారు. బుర్హాన్ వనికి పదేళ్ల వయసు ఉన్నప్పుడు భారత సైన్యంలో చేరతానని అన్నాడట. అంతేగాక, కశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ లాగే తాను కూడా ఓ క్రికెటర్ కావాలని అనుకునేవాడట. ముజఫర్ వని ఓ గవర్నమెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. తాను పాఠాలు చెబుతోన్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పేవాడినని ముజఫర్ వని పేర్కొన్నారు. పిల్లలకు చెప్పినట్లే తన కుమారుడు బుర్హాన్ కూడా అలాగే ఉండాలని అనుకొనేవాడని, భారత సైన్యంలో చేరి దేశానికి సేవలు చేయాలని పదేళ్ల వయస్సులోనే తనకు చెప్పినట్లు ఆయన తెలిపారు. బుర్హాన్ చనిపోయి ఇన్ని రోజులు కావస్తున్నా కశ్మీర్‌లో ఆందోళనలు తగ్గుముఖం పట్టకపోవడానికి ఎవరు బాధ్యులని ముజఫర్ వనిని అడగగా.. హురియత్ కాన్ఫరెన్స్ ఎలాంటి బంద్‌కు పిలుపు ఇవ్వలేదని అన్నారు. బుర్హాన్ వని హతమైన తరువాతి నుంచి చెలరేగిన అల్లర్లతో తాము ఎంతో నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి, రాష్ట్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటూ అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. తాను తన ఇద్దరు కుమారులను కోల్పోయినట్లు తెలిపారు. కశ్మీరులు ఇతరులు కూడా వారి కుటుంబ సభ్యులని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. తమ కుమారుడి మరణం తరువాతే భద్రతా దళాలని ఎదిరిస్తూ కశ్మీరీ యువత ఆయుధాలు చేపట్టారా? అని ముజాఫర్‌ను అడిగితే అలాంటిదేమీ లేదని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర వాసులు పాకిస్థానీయులను, భారతీయులను సమానంగా ప్రేమిస్తారని అన్నారు. యూరీ దాడి గురించి ఆయన స్పందిస్తూ ఆ పని చేసింది హిందుస్థాన్‌లోని ముస్లిం లేదా కశ్మీర్ మిలిటెంట్ల పని కూడా కావచ్చు కదా? అని ఎదురు ప్రశించారు. కశ్మీర్ సమస్యకు పరిష్కరం చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే ఇటీవల జరిగిన పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై దాడి, యూరీ సైనిక శిబిరంపై దాడి వంటి ఘటనలు చోటు చేసుకోవచ్చని అన్నారు. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఎలా చేరుకుంటున్నారని, ఆర్మీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. దాడులకు కారణం జైషే సంస్థకు చెందిన వారేనని సాక్ష్యాలు ఉంటే విచారణ జరపాలని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు 2010 అక్టోబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన తెలిపారు. అనంతరం బుర్హాన్ వని ఉగ్రవాదుల్లో కలిసిపోయినట్టు తనకు తెలిసిందని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను తన కుమారుడికి నచ్చచెప్పాలని ప్రయత్నించినట్లు చెప్పారు. తాను తన కుమారుడిని చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం చూసినట్టు తెలిపారు. జమ్ముకశ్మీర్ కోసమే బుర్హాన్ వని పనిచేశాడని ఆయన అన్నారు. తన కుమారుడి మృతి తనకు ఎంతో బాధకలిగిస్తోన్నా భరించకతప్పదని వ్యాఖ్యానించారు. తన పెద్ద కుమారుడు ఖలీద్ ఈ ఏడాది ఏప్రిల్‌లో భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందాడని ఆయన తెలిపారు. ఆ తరువాత బుర్హాన్ మృతి చెందాడని పేర్కొన్నారు. బుర్హాన్‌ను కలుసుకోవడానికే తన పెద్దకుమారుడు ఖలీద్ వెళ్లినట్టు పోలీసులు భావించారని అందుకే కాల్పులు జరిపారని చెప్పారు. ఖలీద్ ముగ్గురు స్నేహితులను పోలీసులు మొదట అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టారని చెప్పారు.