: ఇదో అద్భుతం... చరిత్రను తిరగరాస్తున్న శాస్త్రవేత్తలు: ఇస్రోపై మోదీ ప్రశంసలు
భారత శాస్త్రవేత్తలు చరిత్రను తిరగరాస్తున్నారని, ఒకే రాకెట్ ద్వారా రెండు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టడం సామాన్యమైన విషయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పీఎస్‌ఎల్వీ - సీ 35 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ, ప్రధాని తన అధికార ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. ఇవి చాలా అపురూపమైన, గర్వించదగ్గ క్షణాలని ఆయన అన్నారు. భారత శాస్త్రవేత్తలు ప్రతిసారీ చరిత్రను లిఖిస్తూనే ఉన్నారని, వారి సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా ఇండియాను గర్వపడేలా చేస్తోందని అన్నారు. కాగా, ఈ ఉదయం 9:12కు శ్రీహరికోట నుంచి బయలుదేరిన పీఎస్ఎల్సీ - సీ35, రెండున్నర గంటల తరువాత అన్ని శాటిలైట్లనూ దిగ్విజయంగా అంతరిక్షంలో వదిలింది. విభిన్న కక్ష్యల్లో ఉపగ్రహాలను ఒకే ప్రయోగం ద్వారా ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి.