: 90 ఏళ్ల బామ్మ సైకిల్ పై రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది.. ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తోంది!


అరవై ఏళ్లు వస్తే చాలు, చాలామంది కృష్ణారామా అనుకుంటూ ఇంట్లోనే కూర్చుంటారు. త‌మ వార‌సుల సంపాద‌నపై ఆధార‌ప‌డుతూ కాలం వెళ్ల‌దీస్తుంటారు. ఒంట్లోకి దూరిన వ్యాధుల‌కి చికిత్స చేయించుకుంటూ నానా అవ‌స్థ‌లూ ప‌డుతుంటారు. శరీరానికి ఏమాత్రం వ్యాయామాన్ని ఇవ్వరు. కనీసం న‌డ‌కకు కూడా వెళ్లరు. అయితే, చిలీకి చెందిన ఎలీనా గాల్వేజ్ అనే 90 ఏళ్ల బామ్మ ఇందుకు పూర్తిగా భిన్నం. ఆమెకు కొన్ని ఆవులు, కోళ్లు ఉన్నాయి. వాటి ద్వారా వ‌చ్చే పాలు, గుడ్ల‌ను తనే స్వ‌యంగా అమ్ముతుంది. అందుకోసం ఆ బామ్మ సైకిల్‌పై ప్ర‌తిరోజూ ఏకంగా 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కిలో మీట‌ర్ కూడా సైకిల్ తొక్క‌లేక బ‌ద్ధ‌కించి పోతున్న యువతరానికి తాను చేస్తోన్న ప‌నితో సందేశాన్నిస్తోంది. ఈ బామ్మ సుమారు 47 ఏళ్ల నుంచి సైకిల్ తొక్కుతుంద‌ట‌. తాను అమ్ముకొచ్చే గుడ్లు, పాల ద్వారానే తాను జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెబుతోంది. వయసనేది కేవలం నెంబర్లలో మాత్రమే ఉంటుందని అంటోంది. తాను ఇత‌రుల‌పై ఆధారపడకుండా ఉండాలనే స్వ‌యంగా ప‌నిచేసుకుంటున్న‌ట్లు చెబుతోంది. తాను ఉప‌యోగిస్తోన్న‌ సైకిల్ త‌న‌కు ప్రియమైన స్నేహితుడని అంటోంది. సైకిల్ లేనిదే తాను లేనని చెప్పింది. తాను ఎక్కడికి వెళ్లినా సైకిల్ త‌న‌తోనే ఉంటుంద‌ని పేర్కొంది. 25 ఏళ్లు దాటినా ఏ ప‌నీ చేయ‌కుండా సోమ‌రుల్లా ఇత‌రుల‌పై ఆధార‌పడుతున్న వారు ఈ భామ్మ‌గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందే.

  • Loading...

More Telugu News