: భారత కీర్తి పతాక... ఎనిమిది శాటిలైట్లు దిగ్విజయంగా నింగిలోకి... ఇస్రో ఘనవిజయం
అంతరిక్షాన భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్ వీ - సీ 35 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా ఉదయం 9.12 గంటలకు ఇగ్నిషన్ ఇవ్వగా, ఆపై నెమ్మదిగా లేచిన రాకెట్, క్షణాల్లో వేగం పుంజుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్లో ఎనిమిది ఉపగ్రహాలు ఉండగా, వాటిల్లో ఇస్రోకు చెందిన స్కాట్ సాట్ - 1తోపాటు అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు శ్రమించి రూపొందించిన 2 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. వీటి మొత్తం బరువు 675 కిలోలు. శాటిలైట్లు పనిచేయడం ప్రారంభిస్తే, దేశంలో పెను తుపానులు, సునామీల ముప్పును ముందుగానే అంచనా వేసే సాంకేతిక సామర్థ్యం ఇండియా పరమవుతుంది. 2017లో అంగారక గ్రహానికి సంబంధించి కీలక ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు వేసిన నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.