: ఏఎన్-32’ కోసం మళ్లీ మొదలైన గాలింపు.. రిమోట్ కంట్రోల్ పరికరంతో వెదుకుతున్న నౌక
ఈ ఏడాది జూలై 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి బయలుదేరి అండమాన్ వెళ్తున్న వాయుసేన విమానం ఏఎన్-32 అదృశ్యమైన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంపై వెళ్తూ అదృశ్యమైన ఈ విమానం కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఫలితాన్నివ్వలేదు. తీరప్రాంత, వైమానిక రక్షణ దళాలు చేపట్టిన ముమ్మర గాలింపు చర్యల్లో విమానానికి సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు తాజాగా ఆదివారం మళ్లీ ప్రారంభించారు. చెన్నై సముద్ర తీరం నుంచి 160 నాటికల్ మైళ్ల దూరంలో అదృశ్యమైన ఏఎన్-32 కోసం రిమోట్ కంట్రోల్ పరికరంతో కూడిన నౌకతో సముద్రంలో గాలింపు చేపట్టారు. సముద్రంలో మూడు కిలోమీటర్ల లోతున విమానం కోసం నౌక గాలిస్తోంది. విమానం కూలిపోయి సముద్రంలో పడిపోయేందుకు అవకాశం ఉన్న 12 ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్టు వాయుసేన అధికారులు తెలిపారు.